పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0280-1 హిజ్జిజి సం: 09-175

పల్లవి:

ఎఱిఁగినపనులకు నిఁకనేఁటికి నీకుఁ
దఱితో నవ్వేవారె తగు నింతేకాకా

చ. 1:

మగువలు వద్దనుంటె మఱతు వన్నిపనులు
తగిలి వెనకముందు తలపోసేవా
వెగటుగ నేముసేసే విన్నప మెందుకెక్కును
బగివాయకుండేవారి భాగ్య మింతేకాక

చ. 2:

కొంగువట్టి తీసితేనె గబ్బున లోనౌదువు
పంగించిచెప్ప నీ కొక్కపాటి వున్నదా
పొంగి నీబాసలు నేఁడు పొగడఁగ నేమున్నది
వుంగరపువేలివారి వోపి కింతేకాక

చ. 3:

కాఁగిలించి కూడితేనె కరఁగుదు వంతలోనె
దాఁగి పెనఁగఁగ నీకు తగవున్నదా
చేఁగదేరఁ గలసితి శ్రీవెంకటేశ నన్ను
వీఁగక నిలుచువారి వెర వింతేకాకా