పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0279-2 సామంతం సం: 09-170

పల్లవి:

నీతలనె వేఁగెనా నిండు భోగాలు
కాతరపుఁ దమకము కాదనఁగఁ గలవా

చ. 1:

దగ్గరి వున్నాఁ డతఁడు తలవంచనేలే
సిగ్గువడఁ బొద్దులేదా చెల్లఁబో నీకు
అగ్గమై చిన్నదానవు అయితే నౌదువుగాక
అగ్గలపు జవ్వనము ఆఁప నింకఁ గలవా

చ. 2:

మాటలాడీ నాతఁడు మౌనము నీకేలే
గాఁటపు నివ్వెరగుకుఁ గాలములేదా
నేఁటనె కొత్తరికము నీకు నైతేనాయఁగాక
వాఁటపు మరుబాణాల వాఁడిచూపఁ గలవా

చ. 3:

కాఁగిలించీ నాతఁడు కళవళమేలే
వీఁగి పరవశాలకు వేళలేదా
చేఁగదేరఁ గూడె నిన్ను శ్రీవెంకటేశుఁ డతఁడు
నాఁగువారె సరసాలు నవ్వకుండఁ గలవా