పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0278-6 వరాళి సం: 09-168

పల్లవి:

అప్పటి కప్పటి మాట లంటి మింతే
వుప్పొలి కినుమడాయ నూరకేవుండవయ్యా

చ. 1:

కంగులేక నీవొళ్లఁ గపటము లేదందువు
అంగముపై పెంజెమట లవిగోవయ్యా
వెంగలితనాన నిన్ను వెల్లవిరి సేయరాదు
అంగడింబెట్టకు పను లట్టె వుండనీవయ్యా

చ. 2:

వొద్దనున్నవారితోడ వొట్టులు వెట్టుకొందువు
అద్దము చూచుకో నీ మోమదిగోవయ్యా
గద్దించిందరిలోఁ దారుకాణలఁ బెట్టఁగరాదు
యిద్దరమే యెరుఁగుదు మిఁక నంతయేలయ్యా

చ. 3:

పలుమారు మాముందర పంతాలు నెరపుదువు
అలవిమీరే గురుతు లవిగోవయ్యా
యెలమి శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
తొలఁకీని మేలు పొత్తున నుండనీవయ్యా