పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0278-1 ఆహిరి సం: 09-163

పల్లవి:

నిలుచున్నాఁ డాతఁడు నివ్వెరగంది నీవు
సళుపుఁ జూపుల నేల సాదించేవే

చ. 1:

చనవుసేసుక నీవు సణఁగులు చల్లితేను
ననుపు సేసు కతఁడు నవ్వు నవ్వెను
పెనచి సరికిసరె బేసిగాదు నీవేల
వెనకటి నేరాలెంచి విడనాడేవే

చ. 2:

నిందలువేసి నీవు నేరము లెంచితేను
కందువలంటి యతఁడు కళరేఁచెను
యిందుకు నందుకు నీడె యీఁతకంటె లోతులేదు
మందెమేళాన నింకేల మచ్చరించేవే

చ. 3:

వావులుచూపి నీవు వలపించి కూడితేను
మోవులుచూపి యితఁడు మోహింపించెను
నీవు నాతఁడు నొక్కటే నేమె మీఁదమిక్కిలి
శ్రీవెంకటేశుఁడె తాను చిమ్ములురేఁచకువే