పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0277-5 సామంతం సం: 09-161

పల్లవి:

నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే
కోకొమ్మని విడెమిచ్చీఁ గొంకకువయ్యా

చ. 1:

ముందరనె నిలుచుండి ముసిముసి నవ్వునవ్వి
కందువలు నీకుఁ జూపీఁ గలికి యదే
అందుకు నీవెఱఁగక అంకెలకు రాకుండితే
విందులు చెప్పి పిలిచీ వినవయ్యా

చ. 2:

చాయలకు మాటలాడి సరసముఁ గొంతచూపి
చేయి నీపై వేసీని చెలియ యిదే
నీయంత సన్నెరఁగక నిండుకొని వుండితేను
ఆయములు గోరనొత్తీనదె కదవయ్యా

చ. 3:

కన్నులఁ దప్పక చూచి కరఁగుచు నట్టె మెచ్చి
కన్నె నిన్నుఁ గూడె శ్రీవెంకటవిభుఁడా
యెన్నికై కడపలోన నిట్టె నన్నుఁ గూడితివి
విన్నపము నీకుఁ జేసీ వింటి వటవయ్యా