పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0277-3 పాడి సం: 09-159

పల్లవి:

అన్నిటాను జాణఁడు అప్పటి నెరఁగఁడు
చిన్నదాన మీకు బుద్దిచెప్పరె యీతనికె

చ. 1:

ముల్లుచూప తొలుతేల మొక్కి తలవంచనేల
వొల్లనె యప్పటి జాడ నుండరాదా
చుల్లరపు నేఁతలేల సుదతికిఁ జిక్కనేల
జెల్లుబడిగా బుద్దులుచెప్పరె యీతనికి

చ. 2:

వట్టి కపటములేల వాకిలి గావఁగనేల
చుట్టరిక మట్లానె చూపరాదా
మట్టులే కలుగనేల మరి వెదకఁగనేల
చిట్టకముదీర బుద్దిచెప్పరె యీతనికి

చ. 3:

మానినుల పొందులేల మాకుపడివుండనేల
కానీవె బుద్దెరఁగఁడా కలికిగాఁడా
ఆనుక శ్రీవెంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
సేనలుగా యిఁక బుద్దిచెప్పరె యీతనికి