పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0277-2 దేశాక్షి. సం: 09-158

పల్లవి:

ఒక్కరి కొకరు లోనైవుండుటగాక
చక్కట్లు చెప్పఁబోతే సమ్మతౌనా సుద్దులు

చ. 1:

మచ్చర మేమిటికమ్మ మగవాఁడు నీతోడ
తచ్చనలు నెరపితే తరిఁ జెల్లదా
ముచ్చటలు మీరాడరా ముందరను వెనకకు
యెచ్చుకుందులు వట్టితే నెనసీనా పొందులు

చ. 2:

చలము లేమిటికమ్మ సరసుఁడు నీతోను
సొలయుచు నవ్వితేను సొంపుదప్పునా
కలయరా యిఁక మీరు కలనైన వెలినైన
కలఁగి తేరఁగఁబోతే గట్టియవునా పనులు

చ. 3:

యెగ్గు లింకేమిటికమ్మ యిదె శ్రీవెంకటేశుఁడు
వెగ్గళించి నిన్నుఁ గూడె వేసటలౌనా
నిగ్గులు చనవు లీరా నేఁడైనా నాఁడైన
సిగ్గులు నెరపఁబోతే చెందునా కోరికలు