పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0276-6 మంగళకౌశిక సం: 09-156

పల్లవి:

నేమెంతేసివారమైనా నిన్ను మీరఁగలమా
కామించి నీవు వచ్చితేఁ గైకొనేముగాకా

చ. 1:

నేరుపులు చరించ నీతోడఁ జెల్లునా
వూరెల్లాఁ జుట్టాలఁ జేసుకుండఁగాను
భారపు పైఁడికొండలో బచ్చుబేరా లమరునా
వూరకె నీమేలు గోరుకుండు టింతెకాకా

చ. 2:

తమిరేఁచేమని నిన్ను దగ్గరఁగఁ జెల్లునా
గములైన సతులతోఁ గరఁగఁగాను
భ్రమసి రేపల్లెవాడఁ బాలమ్మితే సరకౌనా
ప్రమదాన నీకు మొక్కి బ్రదుకుటగాకా

చ. 3:

ఆవటించి నీకు నేఁ బ్రియాలు చెప్పఁజెల్లునా
వేవేలురతుల నీవె వేఁడుకోఁగాను
వావిరిఁ బువ్వులకును వాసనలు గట్టుదురా
శ్రీవెంకటేశ కూడితి చెక్కునొక్కేఁగాకా