పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0276-3 దేసాళం సం: 09-153

పల్లవి:

కాంత నీవు గూడఁగా నేఁగంటి నేలలోఁగేవు
వింతగాఁ గంటికిఁ జూపు వేరయ్యీనా

చ. 1:

నీవు నాకుఁ జుట్టమవై నిలిచినాఁడవుగాన
నీవద్దియింతులు నాకు నెమ్మిఁ జుట్టాలె
పూవులుముడిచితేను పూవులలోవాసనలు
వేవేలుచెప్పినాను వేరులయ్యీనా

చ. 2:

నీమనసు నామనసు నిక్కమూ నొక్కటె కాన
కామించిన నీపనులు కా దన నేను
దీమసాన సొమ్ములెల్ల దేహమున నించుకొంటె
వేమరు వానికాంతులు వేరె వుండీనా

చ. 3:

యెప్పుడూ నీ నా ప్రాణా లేకమయ్యెవుండుఁగాన
యిప్పటి నీజాడలెల్లా నితవె నాకు
అప్పటి శ్రీవెంకటేశ ఆయమంటి కూడితివి
విప్పరాని చనవులు వేరయ్యీనా