పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0275-6 మధ్యమావతి సం: 09-150

పల్లవి:

ఆమాట మీ రెరఁగ రాతఁడె కాని
తామసించి నాడనుండె తన కేలె వెఱవు

చ. 1:

విచ్చేయు మనవె విభుని నిక్కడికె
యిచ్చటనె విన్నవించె నేమి గల్లాను
ముచ్చట దీరదు తనమొగము చూచినదాఁకా
తచ్చివేసి నేనుండఁగ తన కేలె వెఱపు

చ. 2:

తప్పక చూడు మనవె తా నిట్టె నాదిక్కు
యిప్పుడె మంచిది సేసే నేమి గల్లాను
దప్పివోదు నేఁడు నాకు తనతో మాటాడుదాఁకా
తప్పు లెల్ల వొప్పు లయ్యీ తన కేలె వెఱపు

చ. 3:

తలఁచుకొమ్మనవె తనపొందు నాపొందు
యెలమిఁ గాఁగిటఁ దీర్చే నేమి గల్లాను
అలమె శ్రీవెంకటేశుఁ డందుకే మెచ్చినదాఁకా
తలవంచుకున్నాఁడు తన కేలె వెఱపు