పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0275-5 ముఖారి సం: 09-149

పల్లవి:

ఒయ్యనె విన్నవించరె వొద్దనున్న పతిఁ జూపి
నెయ్యపు నివ్వెరగుతో నిలుచున్నాఁ డితఁడు

చ. 1:

తలపోఁత చింత యెంతో తరుణివిరహ మెంతో
చెలువుఁడె వచ్చి పిలిచినా నెరఁగదు
తొలుతె వియోగముతోనె అలసెఁ గాన
నలువంక నిజ మాడినా నమ్మదు

చ. 2:

నిట్టూర్పుగములతో నెరుల చెదరుతోడ
పట్టి కళ లంటినాఁ బతికడ చూడదు
యిట్టె యెదురు చూచి యిందాఁక వేసారెఁగా
గట్టిగా నెదుర నున్నాఁ గల్ల లంటా నున్నది

చ. 3:

విరులపానుపు మీఁద వెడఁజారుఁ బయ్యదతో
సరుఁస బండిన పతిచందము దెలియదు
శిర సెత్తి యిదె కూడె శ్రీవెంకటేశ్వరుఁ
డరుదైన కల గంటి నంటా నాడీని