పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0275-4 వరాళి సం: 09-148

పల్లవి:

మేలుగలవారి కెల్ల మీఁద మీఁద నాస లిట్టె
చాలుకొనుఁ గాని మరి చాలించ దెంతైనా

చ. 1:

గక్కనఁ జూచిన చూపు కాంక్ష దీర దెంతైనా
కిక్కిరించి మరియు మగిడి చూడకా
చొక్కుచు రెప్పవేయక చూచినాఁ దనివోదు
తక్కక ఆరూపె మతిఁ దలపోయకుండినా

చ. 2:

అంది వొకమాటాడితే నంతటఁ దీరదు తమి
మందలించి అట్టె మారు మాటాడకా
పొంది ముచ్చటాడినాఁ బోవు కోరిక లన్నియు
కందువఁ జెలులతో కతలు తాఁ జెప్పకా

చ. 3:

కన్నప్పుడె వొకమాటు కలసినా సొంపులేదు
యెన్నికఁ బెక్కుగతుల నెనయకా
యిన్నిటా శ్రీవెంకటేశుఁ డెరిఁగిన జాణ గాన
నన్నుఁ గూడె నివి నాలో ననుప గాకుండదు