పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0275-3 ముఖారి సం: 09-147

పల్లవి:

ఎంత మొగమాయకాఁడో యేమో కాని
యింతులార వెర గైతి మిఁక నేమో కాని

చ. 1:

మొదల నేమైనఁ జేసి ముందట నీవుండితేను
యెదురు మాటాడఁజాల నేమో కాని
పెదవి కెంపులు రేఁగబెట్టి నాతో నవ్వితేను
యిదివో నే బ్రమసితి నిఁక నేమో కాని

చ. 2:

కొయ్యతనా లెల్ల నాడి కొంగువట్టి తీసితేను
యియ్యకొంటిఁ బనులకు నేమో కాని
పయ్యదపైఁ జెయి వేసి పచ్చితిట్టు దిట్టి తేను
నెయ్యమునఁ గరఁగితి నే నిదేమో కాని

చ. 3:

పంతము లిన్నియు నాడి బలిమిసేసి కూడితి
నింతలోఁ బంత మిచ్చితి నేమో కాని
వంతుకు శ్రీ వెంకటేశ వలపించి నందు కెల్ల
మంతనాన లోనైతి మరి యేమో కాని