పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0275-2 దేసాళం సం: 09-146

పల్లవి:

మంచివానివలెనె మాట లాడీనె
యించుకంతా నెరఁగఁడు యేడవాఁడే తాను

చ. 1:

తీపులపెదవి వంచి తిట్టినా మానఁడు నేఁ
గోపగించు కొనఁగానె కొల్లున నవ్వీనే
రాపుగా నానలు వెట్టి రాకు మన్నా మానఁడే
వోపనని రాఁగా నా వొద్దికి వచ్చీనే

చ. 2:

గొణఁగి గొణఁగి లోలో గుంపించినా మానఁడే
అణఁగి నిద్దిరించఁగా నాయ మంటెనే
వొణికెవేసుక నే నూరకున్నా మానఁడే
సణఁగు లాడఁగ వేరె సాకిరి వెట్టీనే

చ. 3:

వెఱతు మనుచు మొక్కి వేసరినా మానఁడే
కఱకు లాడేవేళ కాఁగిలించీనే
వుఱక శ్రీ వెంకటాద్రినుండి వచ్చి నన్నుఁగూడె
మొఱఁగి వావిలిపాటి ముద్దురామచంద్రుఁడె