పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0275-1 పాడి సం: 09-145

పల్లవి:

చుట్టపువరుసఁ గొంత చూచిఁ గాక
అట్టె యే మన్నా నెదురాడేవా నీవు

చ. 1:

అలిగి రాకుండఁగాను ఆనలె పట్టెఁ గాక
చెలి నిన్నుఁ దిట్టితేను చెల్లదా నేఁడు
వులవచ్చి సిగ్గుతోడ నూరకున్న నుండెఁ గాక
చలివాయఁ జెనకితే జంకించేవా నీవు

చ. 2:

పంతము నీ వాడఁగాను పాడియె నడపెఁగాక
కాంత యేది దలఁచినాఁ గాక మానీనా
జంతతనమేలంటాఁ జక్కనుంటె నుండెఁ గాక
దొంతిగాఁ బై నొరగితే దూరేవా నీవు

చ. 3:

చెక్కు నొక్కి కూడఁగాను సెలవినె నవ్వెఁ గాక
చుక్కలు మోవి నించితే సూడు వట్టేవా
యెక్కువ శ్రీ వెంకటేశ యింతి నీతొ నొక్కటాయ
మక్కువ నీ మేలింకా మరచేవా నీవు