పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-5 ఆహిరి సం: 09-143

పల్లవి:

సేతునో నీ మేన నెల్ల జీరలుగాను
ఆతల సూడువట్టే దదె చూచేఁ గాని

చ. 1:

ఱెప్ప లెత్తి చూచితేనె ఱేసు వుట్టె నిదె నీకు
దుప్పటి కొంగు వట్టితే దూర కుండేవా
చొప్పుగానా యించుకంతఁ జూతమువో యిఁక నేల
కప్పిన నీ బింక మెల్లఁ గనుఁగొనేఁ గాని

చ. 2:

కవ కవ నవ్వితేనె కాఁగిపడే విప్పు డిట్టె
తివిరి కాలు దాఁకితే తిట్ట కుండేవా
వివరించి అది వెల్లవిరి సేతునో వోరి
అవల నీతో జగడమైన నయ్యీఁ గాని

చ. 3:

ఆయము లంటఁగఁ బోతే ననుమానించే వందుకు
చేయి వేసి కూడితేను చిక్క కుండేవా
చాయల శ్రీ వెంకటేశ సమ్మతించి కూడితివి
సేయఁగలవి సేతునో చేరి మొక్కేఁ గాని