పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-4 సాళంగం సం: 09-142

పల్లవి:

నవ్వవొద్దా యిందుకుఁగా నాకు నాకె నిన్నుఁ జూచి
యివ్వలనెయింత సేసే వేలయ్య నాయకుఁడ

చ. 1:

చూడవొద్దా ఆకె నిన్నుఁ జూచి సారె మొక్కఁగాను
యేడ నన్నా సిగ్గువడే వింత దగునా
ఆడవొద్దా మారుమాట ఆకె నిన్నుఁ బిలువఁగా
యేడో పరాకయ్య వేలయ్య నాయకుఁడ

చ. 2:

చేరవొద్దా మగువను చెనకి సరసమాడ
కూరిమి దెలిసేరంటా గుట్టు సేసేవు
మేరమీరవొద్దా ఆకె మెచ్చి చెయి వేయఁగాను
యీరీతి వొలసీ నొల్లా లేలయ్య నాయకుఁడ

చ. 3:

కప్పవొద్దా పచ్చడము కాఁగిలించి కూడఁగాను
దప్పి దేరె మోవితేనె దగ దొట్టేవు
వొప్పుగా శ్రీ వెంకటేశ వుండవొద్దా రాజసాన
యిప్పుడే పెండ్లాడి తింత యేలయ్య నాయకుఁడ