పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-5 శంకరాభరణం సం: 09-137

పల్లవి:

ఏమి నెరఁగని బాల నేమి సేసితివో
ఆమని కాలములోనె అది యేమి సేసితో

చ. 1:

కన్ను లెల్లఁ దెల్లనాయ కాయ మెల్లఁ జల్లనాయ
కన్నె నేమి సేసితివో కట్టా కట్టా
వన్నె మేనఁ జంజురేఁగె వాడుమోవి గడు మాఁగె
ఇన్నాళ్లవలెఁగాదు యేమి సేసితివో

చ. 2:

కొప్పు గడుఁ జిక్కు వడె కుచములు తొక్కవడె
అప్పటి నేమిసేసితి వయ్యో అయ్యో
చిప్పిలె నిట్టూరుపులు సిగ్గులివె గొరుపులు
యిప్పు డిట్టె యీ సతి నేమి సేసితో

చ. 3:

చెక్కు లెల్లఁ జెమరించె సెలవుల నవ్వు ముంచె
వొక్కమాటె యింత సేసి తోహో వోహో
నిక్కి శ్రీ వెంకటపతి నీవు గూడఁ బోలుదువు
యెక్కువ మేనిగుతురు లేమి సేసితో