పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-3 ముఖారి సం: 09-135

పల్లవి:

పదిలమై వుందుగాని పదరకుమీ
వెదకితేఁ జూపవలె వెఁస జుమ్మీ విభుఁడ

చ. 1:

అందపు నీ మోవితేనె లాని యాని యెవ్వతో
అందుపైఁ గెంపులు నించె నదె చూడుమా
పొందుల నదెవ్వరికి పొరసి నీ వియ్య కుండా
కందువ మెత్తులు వేయు గతి సుమ్మీ విభుఁడ

చ. 2:

చక్కని నీ దేహమంటి సారె సారె నెవ్వతో
అక్కడ రేకలు నించె నది యెవ్వతో
గక్కన వేరొకతెకుఁ గాఁగిలి నీ వియ్యకుండా
లెక్కల లచ్చెనవెట్టే లీల సుమ్మీ విభుఁడ

చ. 3:

కూరిమి నీ రతిఁ గూడి గురుతుగాఁ గుచముల
కోరి ముద్ర లురమునఁ గుంకుమ నొత్తె
ఆరీతి శ్రీవెంకటేశ అరమరపంచినది
నేరుపరెవ్వరుఁ గారు నేఁ జుమ్మీ విభుఁడ