పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-1 శుద్దవసంతం సం: 09-133

పల్లవి:

చాలుఁ జాలు నేతులు సటలు నీ రీతులు యీ
నీలిచేఁతపతిఁ గాక ని న్నేమనేదే

చ. 1:

వద్దేలె మాటలు వలవని నీటులు
వొద్దనె నే మింతలేసి కోపుదు మటే
యిద్దరిలో నినుఁ బెంచి యింత సేసె నాతఁడు
నిద్దమై యాతనిఁ గాక ని న్నేమనేదే

చ. 2:

ఔనె నీ సుద్దులు ఆడెటి బద్దులు
వూని యింతలేసికి నే నోపుదునటే
యీ నీకుఁ జిన విచ్చి యింత సేసె నాతఁడు
నే నింకా నాతనిఁ గాక ని న్నేమనేదే

చ. 3:

పోపో నీ కతలు పోకుల నీ గతులు
వూఁపుల రాఁపుల నే నోపుదు నటే
యేపున శ్రీ వెకంటేశుఁ డింతలో నన్నుఁ గూడె
నీ పొందులాతనిఁ గాక ని న్నేమనేదే