పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0272-6 బౌళి సం: 09-132

పల్లవి:

మేఁటులాల బోఁటులాల మీ రెరఁగరా నన్ను
నీటునఁ దా నొద్ద నుంటె నేర మెంతునా

చ. 1:

మోము చూడఁగా నేను మొరఁగి నవ్వితిఁ గాక
తా ముందు వూరకుంటెఁ దడవితినా
ప్రేమమునఁ బిలువఁగా బెట్టి వూఁకొంటిఁ గాక
దోమటిఁ దడవకుంటె దొమ్మి సేతునా

చ. 2:

చెక్కు నొక్కఁగా నే జీర వారించితిఁ గాక
చక్క నుంటెఁ దన్ను నే సాదింతునా
నిక్కి పూవుల వేయఁగా నీటునఁ దిట్టితిఁ గాక
మిక్కిలి గుట్టున నుంటె మితిమీరుదునా

చ. 3:

బలిమిసేయఁగఁ దన్నుఁ బైకొని కూడితిఁ గాక
చలమున బంత మంటె సాగనిత్తునా
యెలమి శ్రీవెంకటేశు నింపులఁ జొక్కితిఁ గాక
తలఁ పెరఁగక వుంటె దగ్గరుదునా