పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0272-5 ఆహిరి సం: 09-131

పల్లవి:

అయ్యో తా నేమని నప్పటిఁ దాను
పయ్యదలో సిగ్గు దాఁచి బడలఁగాను

చ. 1:

చూపులనె గుండె వట్టి సుద్దులనె మిన్ను ముట్టి
దాపు సేసుకొని తన్నుఁ దలఁచఁగాను
తీపు మేలములఁ జిక్కి దిక్కులఁ దనకు మొక్కి,
తోపు నూకుడు వయసు దొబ్బఁగాను

చ. 2:

ఆసఁ బులకలు వెంచి అంగము చెమట ముంచి
బాసలు తనవి నమ్మి బతుకఁ గాను
వాసికిఁ దనువు మోచి వంతుకుఁ బ్రాణముగాచి
వోసరించి వూరకె నే నుండఁగాను

చ. 3:

తానె నే నని యాడి దగ్గరి కాఁగిటఁ గూడి
నానిన నవ్వులు గుట్టు నడపఁగాను
యీ నెపాన శ్రీ వెంకటేశుఁ డింతలో నన్ను
పూనుక మన్నించె నని పొగడఁగాను