పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0272-4 సామంతం సం: 09-130

పల్లవి:

తగుమాట లేమిగల్లా దవ్వులఁ జెప్పుదుగాని
అగడయ్యీ నీవు నన్ను నంత దగ్గరకురా

చ. 1:

యెగరే జక్కవలు యిదివో నాకుచములు
గగనపు చకోరాలు కనుఁగవలు
తొగరుఁ దుమ్మిదలు నాతురు మిదివో నేఁడు
బెగడుఁ జేసు నన్ను బెట్టి పిలువకురా

చ. 2:

కొండలసింహము నా కొనబైన నడుము
గండు మీరి నా పిరుఁదు కరికుంభాలు
నిండిన నా పాదములు నీటిలోని తాఁబేళ్ళు
చండిపడ నీవు నన్ను సారెఁ జెనకకురా

చ. 3:

మించులమెరఁగు లివి మేఁటి నాతనువు
దించని తేనెల పెరతీపు నా మోవి
అంచల శ్రీవెంకటేశ అంతలోనె కూడితివి
యెంచఁగ నిన్ను మరిగె నిన్నిటాఁ బాయకురా