పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0272-3 కాంబోది సం: 09-129

పల్లవి:

ఇంత చాలదా మాకు నిదినేఁడు
కంతునివోజల పెండ్లి గలిగెఁ గా నేఁడు

చ. 1:

కాంతకును నీకును కనురెప్పలె తెర
దంతపు నవ్వులె మీకు తలఁబాలు
రంతుల వూరుపలె రవళి సోబనాలు
చెంతల మీ కీ పెండ్లి చెల్లెఁగా నేఁడు

చ. 2:

ముదితకు నీకును మోవులె బువ్వములు
కదియు సిగ్గులె మంచి కమ్మగందాలు
సదరపు సరసాలె చల్లు వెదవీడేలు
యెదుదెదురనె పెండ్లి యెసగెఁగా నేఁడు

చ. 3:

వుంచపు గోరితాఁకులె వుంకువ సొమ్ములు
ముంచిన పలు సోఁకులె ముయికిముయి
యెంచఁగ శ్రీవెంకటేశ యిందిర నీ కూటములు
కంచపుఁ బెండ్లి మీకుఁ గలిగెఁగా నేఁడు