పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0252-6 ఆహిరి సం: 09-012

పల్లవి:

చెప్పినట్టు సేసేఁగాక చెనక నేలా
కప్పితివి పచ్చడము ఘన తిదె చాలదా

చ. 1:

యెన్నిలేవు మంచిమాట లెందాఁకా నాదేవు
విన్న వినుకులె కావా వెనకకును
సన్నముగాఁ బులకించె జలజలఁ జెమరించె
కన్నుల నీళ్ళు దుడిచి కైకొంటివి చాలదా

చ. 2:

యింతలోనె చెక్కు నొక్కే వేమి నేరుచుకొంటివి
వంతు వచ్చినదెకాదా వనితలతో
దొంతులాయఁ గోరికలు తురుమునెరులు జారె
యింతట వంచినశిర సెత్తితివి చాలదా

చ. 2:

కలసితి విట్టి నిన్ను కడుజాణ మవుదువు
తొలుతనె మెచ్చనా దూరుతా నిన్ను
యెలమి శ్రీ వెంకటేశ యేకచిత్తమాయ నాకు
తెలిగన్నులనె సిగ్గు దేర్చితివి చాలదా