పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0252-5 భైరవి సం: 09-011

పల్లవి:

నీవు వాఁటి దూర నేలె నిన్ను నంటినకతాన
యీవిధిఁ బొందెను నిన్ను నివి దూరుఁగాక

చ. 1:

కప్పుర మేమి సేసునె కాంతుఁడు రాకుండఁగాను
అప్పటివేళనె కారమాయఁగాక
తప్పుగద్దా గందానకు తాపాన నీ వుండఁగాను
వుప్పతిల్లి దానికె వుడుకెత్తెఁగాక

చ. 2:

విరులకు నేర మేదె విరహంపువేళ నీకు
గరిమ వేఁడికి నొడిగట్టెఁగాక
మరుఁడు పగవాఁడా నీమనసులో కాఁక సోఁకి
తిరమై అనంగుఁ డంటా తిట్టువడెఁగాక

చ. 3:

చల్లగాలి వెట్ట యౌనా సారె నీమీఁద విసరి
పల్లదాన వడ దాఁకి భ్రమసెఁగాక
యిల్లిదె శ్రీ వెంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడఁగాను
యెల్లవారు మంచివారై యీడేరిరిగాక