పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0271-6 సామంతం సం: 09-126

పల్లవి:

విన్నవించనేల యిందు వేమారుఁ దనతో
యెన్నిక నేఁ జేసేదేమి యిఁకఁ దనచిత్తము

చ. 1:

చెప్పరాని చూపరాని చిత్తములో మర్మము
అప్పసము నాలోని అడియాస యిదిగో
కప్పియుఁ గప్పగరాని కన్నులలో మర్మము
దప్పి దేరిచే చక్కని తనరూపె పో

చ. 2:

పట్టియుఁ బట్టఁగరాని పాయములో మర్మము
ముట్టుపడ్డ పతిమీఁది మోహ మిదిగో
కుట్టియుఁ గుట్టఁగరాని కుచముల మర్మము
పొట్టఁ బొరుగున రేఁగే పులకలు వో

చ. 3:

అందియు నందఁగరాని ఆయముల మర్మము
సందడిఁ బరవశాల సంగతిదివో
కందువ శ్రీవెంకటేశుఁ గలసిన మర్మము
గొందినె యీతని గోరిగురుతులె పో