పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0271-4 వరాళి సం: 09-124

పల్లవి:

కంటి నే నంతలోఁ గడల మీ భావము
దంటలగు మీర లిద్దరు జాణలే

చ. 1:

పెడమరలి అటుచూచి పెదవులనె నినుఁ దిట్టి
పడఁతి మరలెను నీవు పై కొనినను
గొడఁగుచును బొమ్మలనె గొబ్బుననుఁ గోపించి
అడఁగి తలవంచె నీ వపు డేమి సేసితో

చ. 2:

తళుకునను నిన్నుఁ గనుఁదమ్ములనె జంకించి
బెళకి నిలిచెను నీవు పేరుకొనఁగ
వులికిపడి నిన్ను నిట్టూర్పులనె కడుఁ గసరి
చెలుల మొరఁగెను నీవు చెనకఁగాను

చ. 3:

కొమ్మ కాఁగిటఁ గూడి కొనగోర నిను నడిమి
వుమ్మడిఁ గమ్మరఁ దానె వూరకుండి
చిమ్ములఁ బూఁబొదరింట శ్రీవెంకటేశ్వరుఁడ
నెమ్మది నుంటిరి కళలునిండె మోమునను