పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0271-3 కాంబోది సం: 09-123

పల్లవి:

మున్నిటి తానెకాఁడా మోన మింకానా
కన్నులఁ జూచుట గాక ఘాత లింకానా

చ. 1:

మాయల వేరొకతెతో మాటలాడఁ గానె
చాయల నేఁ జేసే సన్న లింకానా
ఆయెడ నా రాక గని అటు తలవంచఁగాను
యేయెడ నే దూరి తిట్టే దిది యింకానా

చ. 2:

విరహపు నన్నుఁ జూచి వికవిక నగఁగాను
సరస నా బొమ్మల జంకె లింకానా
సిరుల నాకె దన చెలియని బొంకఁగాను
నిరతి నిజము గొల్పే నీటు లింకానా

చ. 3:

యెదుట నామోము చూచి యింటి కిట్టె రాఁగాను
కొదలు గొణఁగుల నా కోప మింకానా
అదన శ్రీవెంకటేశుఁ డాదరించి కూడె నన్ను
కదిసి వుండెటె కాక కా దను టింకానా