పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0271-2 కాంబోది సం: 09-122

పల్లవి:

నేఁడుగా యివి తనకు నాఁడె పో నాకు
కూడిన మీరు సాకిరికొమ్మలాల

చ. 1:

తాలిమి లేక యిట్టె తనలోనె కోప ముంటె
నాలో నున్నవిగా నవ్వులు
నీలాన తనమాట చిరుచేఁదు లుంటేను
తేలెటి నా మోవిఁ గా తీపులు

చ. 2:

తెంపుల తనబొమ్మల తిట్ల సొలపు లుంటె
వంపు నా రెప్పలఁ గా వలపులు
యింపు లేక తనమతి నెగ్గులును తప్పులుంటె
పెంపున నా కున్నవిగా పెను వేలి మొక్కులు

చ. 3:

తమ్మి మరునేట్ల తనరు తమక ముంటె
చిమ్ముల నా కున్నవిగా సిగ్గులు
అమ్మరొ శ్రీవెంకటేశుఁడన్నిటా నన్నుఁ గూడె
కుమ్మరించె నాపై కొనగోరిసొమ్ములు