పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0271-1 రామక్రియ సం: 09-121

పల్లవి:

ఆడరాని చూడరాని యట్టి దొర వింతే కాక
యేడ నైనఁ జెలి నీకు నేమి సేసెనయ్యా

చ. 1:

కాంత నీకు సన్న సేసె కమ్మరఁ బూబంతి వేసె
సంతమై మరుకాఁకల జలి గాసె
చెంత నీవు చూడఁగాను సిగ్గునఁ బయ్యద మూసె
యింతే కాక ఆకె నిన్ను నేమి సేసెనయ్యా

చ. 2:

వలపు నీపై నించె వడిఁ బులకలు వెంచె
చెలప చెమట లవె చెక్కున ముంచె
నిలువు నీ చేఁతలకు నిట్టూర్పులఁ దలవంచె
యెలమి నిన్నాకె మరి యేమి సేసె నయ్యా

చ. 3:

నీ యెదుటఁ దాఁ బొలసె నీటున నిన్ను సొలసె
కాయజకేలి నిన్నుఁ గడుఁ గలసె
పాయపు శ్రీవెంకటేశ పడఁతి నీతో వెలసె
యీయెడ నిందాఁక నాకె యేమి సేసెనయ్యా