పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0270-3 ముఖారి సం: 09-117

పల్లవి:

అయినట్టయ్యీఁ గాక అంతయేఁటికే
పయిపై గలపితివి పాఁచి యేఁటికే

చ. 1:

వల్లెవాటుఁ బయ్యదతో వాడుఁగొప్పు విరులతో
చల్లె లమ్మె గొల్లెతవు జంకె నేఁటికే
చిల్లర చెమటతోడ చిక్కని వూర్పులతోడ
గొల్లలెక్క లాడేవు కోప మేఁటికే

చ. 2:

పులకజొంపాలతోడ బొమ్మంచు మోవితోడ
కొలచినందె కొలచి కొంక నేఁటికే
కలకల నవ్వుతోడ కందువ సిగ్గులతోడ
వెలయఁగఁ జెప్పేవు వింత లేఁటికే

చ. 3:

పుక్కిటి విడెముతోడ పూఁతల గందముతోడ
అక్కునఁ బోసి చూపే వాన లేఁటికే
యెక్కువల శ్రీ వెంకటేశుఁడనైన నన్ను
గక్కనఁ గూడితి వింక గద్దించ నేఁటికే