పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0269-6 బౌళిరామక్రియ సం: 09-114

పల్లవి:

ఒద్దు మమ్ముఁ జెనకక వుండుమనవే
యిద్దరము నెదురైతి మింతె పొమ్మనవే

చ. 1:

పాలవంటికులము మా భావము నిచ్చలము
నాలి మమ్ముఁ జూచి యేల నవ్వీనె తాను
పోలింప మా యంకులును పుప్పొడిమై సంకులు
చాలు నిది చూచి తాను సన్నలేల సేసీనే

చ. 2:

మోచేవి చల్లలు నేము ముడిచేవి మొల్లలు
పూఁచి యేల రట్టుసేసి పొంచీనె తాను
కాచేదా మా మందలు కడసారె నిందలు
యేచి తాను మమ్ము గేలి యేల సేసీనే

చ. 3:

గుంపెన మా నడపు కొప్పు గడు నిడుపు
తెంపున మమ్మేల యింత తేల నాడీనే
యింపుల శ్రీవెంకటేశుఁ డింతలోనె మమ్ముఁ గూడె
సంపదల మమ్ము నేల సాదించీనే