పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0269-3 ఆహిరి సం: 09-111

పల్లవి:

ఇట్టిదివో సతిమోహ మిదివో మా విన్నపము
యెట్టు వలసినఁ జేయు మిఁక నీచిత్తము

చ. 1:

తరుణి నీకు వలచి తనువె మఱచెఁ గాని
మరులు నీపై భక్తి మఱవదు
గిరమ విరహవడఁ గన్నులు మూసెఁ గాని
నిరతి నీవు వచ్చే వని తలుపే మూయదు

చ. 2:

నిండు నీపై చింతచేత నిద్దుర విడిచెఁ గాని
దండి నీ నామజపము తా విడువదు
అండనె సింగారించె యాసలె మానెఁ గాని
నిండుఁ జేత నీకు మొక్కే నేమమే మానదు

చ. 3:

చిక్కి యిట్టెఁ నిన్నుఁ గూడి సిగ్గులతోఁ బాసెఁ గాని
తక్కక నీ సరసము తాఁ బాయదు
మిక్కిలి శ్రీవెంకటేశ మెచ్చ నిన్ను నేర్చెఁ గాని
చక్క నీ వెటు సేసినా సాదించ నేరదు