పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0269-2 మంగళకౌశిక సం: 09-110

పల్లవి:

ఏకచిత్త మైనప్పు డిన్నియు మరెయ్యీఁ గాని
నాకు నీ వేళకు నీ నవ్వులె చాలు

చ. 1:

చిక్కువడివున్నది నాచిత్తము నీ
చెక్కులఁ జిందరలైన జీరలవలె
చక్క నన్ను మాటాడించకురా నీవూ నీకు
మొక్కేను నా కింక మోనమె చాలు

చ. 2:

కడుఁ గాఁక రేఁగె నా కాయము నీ
కడల పుక్కిటతమ్మకారమువలె
పడి నా పయ్యెదకొంగు పట్టకురా నీకు
వెడఁ బంత మిచ్చే నాకు విరహమె చాలు

చ. 3:

పరవశమాయ నా భావము
గరిమ నిద్దురల నీ కన్నులవలె
యిరవై శ్రీవెంకటేశ యేలితివి యిది
మరిగితిమి నాకు నీ మన్ననె చాలు