పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0269-1 ముఖారి సం: 09-109

పల్లవి:

కాఁగలదయ్యీఁ గాక కాఁక లేఁటికే
దాఁగ నేల యింతలోనె తానె నే ననవే

చ. 1:

కంటిచూపు వాఁ డాయ కమ్మనవ్వు వేఁడాయ
యింటిలో నింకా బుద్దులేమి చెప్పేవే
కుంటెనలు విసుపైఁ గోరికలు ముసిపై
అంటఁగాక వున్నదాన నానవెట్ట నేఁటికే

చ. 2:

మంతనాలు దరచాయ మాటపట్టు గురుచాయ
యెంత కెంత వొడఁబాట్లిఁక నేఁటికే
దొంతులాయఁ గూరిములు దూరులాయ నేరములు
వంతులు వాసులు నింక వద్దనవే

చ. 3:

చిత్తమెల్ల నీ రాయ సిగ్గు లెల్ల జారాయ
యిత్తల వెనకసుద్దు లిఁక నేఁటికే
అత్తిన శ్రీవెంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
తత్తరపు వేడుకలు దలకూడెనే