పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0268-5 పాడి సం: 09-107

పల్లవి:

ఎట్టు గెలువఁగ వచ్చు నిట్టి వానిని
మెట్ట వచ్చీ నా కాలు మేలు గాదా

చ. 1:

కొచ్చి కొచ్చి తన్నునేఁ గోపగించఁగా తా
నచ్చపు నవ్వులు నవ్వీ నంతె కాదా
వొచ్చ ముదనందు నే నొగిఁ జూపఁగా నన్ను
మెచ్చి చేయి వేయ వచ్చీ మేలు గాదా

చ. 2:

వెక్కసమై తన్నునే వెంగెమాడఁగా తా
నక్కడివా రందు మోపీ నంతె కాదా
తెక్కుల నేఁ దన్ను దూరి తిట్టఁ గానె నేఁడు దా
మిక్కిలి నన్ను దీవించీ మేలు గాదా

చ. 3:

కడుఁ దమకాన నేఁ గసరఁగా తా
నడరి కాఁగిట నించీ నంతె కాదా
యెడయక శ్రీ వెంకటేశుఁ డిటు గూడి నా
మెడ యెత్తి చెక్కు నొక్కీ మేలు గాదా