పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0268-2 పాడి సం: 09-104

పల్లవి:

కొండవంటి దొరతోడి కోపములేల
దండనె దవ్వుదవ్వుల దక్కుటింతె కాకా

చ. 1:

పూచిన వెన్నెలలంటేఁ బుప్పొడి వెదక నేల
చూచి చూచి కన్నులనె చొక్కుట గాక
యేచి నీవు నవ్వితే న దేమని యడుగ నేల
నాచుల మారుకు మారు నవ్వుటింతె కాక

చ. 2:

నేతిబీరకాయంటే నేయి వెదకఁగ నేల
వూఁతగొని లోలోనె వూఁకొంట గాక
చేత నీవు విలిచితే చేరి దగ్గరఁగ నేల
మోఁతల నందుకు మెచ్చి మొక్కుటింతె కాకా

చ. 3:

కోరి మోవితేనెలంటే గుక్కిళ్లు మింగ నేల
చేరి నిన్నుఁ గూడి యిట్టె చేకొంట గాక
ఆరయ శ్రీవెంకటేశ అంత నీతోఁ జల మేల
మేర మీరినట్టి నిన్ను మేలనుట గాక