పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0268-1 సాళంగనాట సం: 09-103

పల్లవి:

సటలకు జంపు నాతో జరపీఁ గాక యిట్టె
కటకటా నిజ మెల్లఁ గానరాదా నాకు

చ. 1:

కడుమోహము నాపైఁ గలవాఁడె తా నైతె
యెడమాట లాడుదాఁకా హృదయము నిలిచీనా
వొడఁబాటులేమి గల్లా వొద్ద నాతో నాడుఁ గాక
విడువు మనవె యిట్టివేషము లెరఁగనా

చ. 2:

కరుణె తనమతిఁ గలిగినవాఁ డైతె
అరయ నాహార నిద్ర లాడఁ దన కింపౌనా
కొరతలేమిగల్లాఁ గోరి నాతో నాడుఁ గాక
వెరవున విడు విడు వేసా లెరఁగనా

చ. 3:

తానె నే నైతె తనువులు వే రౌనా
తానె మతికి మతిఁ దారుకాణ లౌఁ గాక
యీ నెపాన శ్రీవెంకటేశుఁడు నన్నుఁ గూడె
వీనుల వినిన నింతె వేసా లెరఁగనా