పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0267-5 సామంతం సం: 09-101

పల్లవి:

ఆఁటదాని కింత యేల అంతలోని పనికిఁగా
పూఁటపూఁటఁ దనతో నేఁ బోరనేలా

చ. 1:

వలవని పతికె వలచే యా రోఁత లేల
మలసెటి విరహాగ్నిమంట లేదా
పలుకని పతితోడఁ బలుకఁగ నది యేల
ములుగుచుఁ బానుపుపై మోనము లేదా

చ. 2:

యింటికిరానిపతికి నెదురు వోవఁగ నేల
జంటయి మునుఁగఁ జింతాజలధి లేదా
నంటులేని పతితోడ నవ్వఁబో నంత యేల
అంటరాని చిగురాకుటమ్ములు లేవా

చ. 3:

కడదొక్కె పతితోడఁ గాఁగిలించ నిది యేల
ముడిచి యవ్వలి మారుమోము లేదా
అడరి శ్రీవెంకటేశుఁ దాదరించి నన్నుఁ గూడె
సడి వూరకే యంటి సరసము లేదా