పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0017-1 ముఖారి సం: 05-096

పల్లవి:

పసులు గాచేటి కోల పసపుఁ జేల
పొసఁగ నీకింతయేల బుద్ధుల గోల

చ. 1:

కట్టిన చిక్కపు బుత్తి కచ్చకాయల తిత్తి
చుట్టిన పించెపుఁ బాగ చుంగుల సోగ
ఇట్టి‌ సింగారము సేయ నింత నీకుఁ బ్రియమాయ
వెట్ట నీచేఁతల మాయ విట్టలరాయ

చ. 2:

పేయలఁ బిలుచుకూఁత పిల్లఁగోవి బలుమోఁత
సేయరాని గొల్లెతల సిగ్గులచేఁత
ఆయెడలఁ దలపోఁత యమున లోపలి యీఁత
వేయరాని మోపులాయ విట్టలరాయ

చ. 3:

కొంకులేని పొలయాట కూరిములలో తేట
అంకెల బాలులతోడి యాట పాట
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము
వేంకటనగము చాయ విట్టలరాయ