పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0016-2 వరాళి సం: 05-091

పల్లవి:

పన్నీరు చల్లెరా నీపై పలచని దెవ్వతో
అన్నువయలపుతోడ నసలాయఁ జెక్కులు

చ. 1:

కప్పురము చల్లె నీపై కలికి యదెవ్వతో
యిప్పుడె నీ వురమెల్ల నెఱ్ఱ నాయను
చెప్పరాని మురిపెంపు చేఁతలెల్ల నాకును
కప్పిఁన గప్పఁగరాని గతులాయ నిప్పుడు

చ. 2:

మృగనాభి చల్లె నీపై మెలుఁత యదెవ్వతో
తెగువ నీమోమెల్ల తెల్లనాయను
నగపు మేలము గాదు నమ్మరా నా పలుకు
సగవాయ నిప్పుడే యీ చక్కని నీ దేహము

చ. 3:

కుంకుమ చల్లెర నీపై కోమలి యదెవ్వతో
సంకె దేరి నీమేనెల్లా చల్లనాయను
వేంకట విభుఁడ నీకు వెచ్చమైతిఁ జెప్పరా
వుంపకుగా నాకు నబ్బె ఉదుటు నీచేఁతలు