పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0016-3 ఆహిరి సం: 05-092

పల్లవి:

కుందణంపుమై గొల్లెత తా -
నెందును బుట్టని యేతరి జాతి

చ. 1:

కప్పులు దేరేటి కస్తూరి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి

చ. 2:

దుంప వెంట్రుకల దొడ్డతురుముగల -
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్తిణిజాతి

చ. 3:

వీఁపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి

చ. 4:

గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
బారపుటలపుల పద్మిణిజాతి