పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0016-1 సామంతం సం: 05-090

పల్లవి:

వద్దు నాతో బొంక నిటువలె నీకు నీ -
సుద్దుల కాఁకల మంట సొద చొచ్చేరా

చ. 1:

కనలి నే నపరాధిఁ గానని కలికి నీ -
కొనచూపులనే యలుగులఁ బారేనే
యెనసి యెవ్వతెకొ మోహింతువని నీ మోవి
మనసార నాలిక మడ్డువట్టే రా

చ. 2:

మఱచి యెవ్వతెతో నే మాటాడనని నీ -
చిఱునవ్వు నిప్పులు దోసిట ముంచేనే
తెఱలఁ గాఁగిన నీ దేహపు టుక్కుఁ గంబము
కఱతలిన్నియు నని కౌఁగిలించేరా

చ. 3:

నెలఁత దక్కితినని నీ వీడెపు రసము
చలివాయ నిపుడు పోసము దాగేనే
కలసియు నన్ను వెంకటరాయ కపటాన -
నలయించేవని నీపై నాన వెట్టేరా