పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0015-5 ముఖారి సం: 05-089

పల్లవి:

ఆతఁడేపో చెలియా మాయాతఁడు
చేతనే పరము చూపి చెలువైన యాతఁడు

చ. 1:

కుప్పలుగాఁ గస్తూరియు కుంకుమయు మయినిండ -
నప్పళించుకొని యున్న యాతఁడు
గొప్పగొప్ప ముత్తేల కుప్పె సవరము పెద్ద-
కొప్పుతోఁ జెలఁగీనదె కో మా యాతఁడు

చ. 2:

మలయుఁ జెక్కుల నవ్వు మకర కుండలముల
అలర నిగ్గులె చల్లే యాతఁడు
బలువైన ముత్యాల పదకాల హరాల
వెలుఁగొందీ నదె చూడవే మా యాతఁడు

చ. 3:

సంకుఁ జక్రపుఁ జేతుల సందుల బాహుపురుల
అంకెలఁబ్రభల మించే యాతఁడు
వేంకట నగము మీఁద విభవంపుఁ గౌఁగిలి నా -
కుంకువగా నిచ్చె నదెకో మా యాతఁడు