పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0015-4 కన్నడగౌళ సం: 05-088

పల్లవి:

ఏమనఁగలదిఁకఁ గాలము యింతయు విపరీతములై
భామినిదేము పరితాపంబున వేఁగెడిని

చ. 1:

కప్పురమియ్యని వీడెము గైకొనకొల్లని కాంతకు
కప్పురమంటిన చోట్లే కడుఁగడుఁ దొక్కెడిని
పుప్పొడివెన్నెల పొళ్ళు (?) పొలఁతికి వెన్నెల బాయిలు
నిప్పులఁ దోఁగినయట్లే నిలువునఁ గాఁగెడిని

చ. 2:

పానుపు పువ్వులఁ బరవక పవళింపుని సతి పూవులఁ
పానుపు కన్నులఁ జూచినఁ బరవశమందెడిని
లేనగవొదవని మాటలు లేనిలతాంగికి నగవులు
కానుకపట్టిన నొల్లక కన్నుల విసిగెడివి

చ. 3:

కందర్పుని గురుఁడనఁగాఁ గలిగిన తిరువేంకటపతి -
చందము చూపుల బామిని చనవున నొప్పెడిని
ఇందు వదనకే దేవుఁడు యింపులఁగడు మన్నించిన
కందువ పొలయలుకలఁ దమకమువడి రేఁపెడిని