పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0015-3 శ్రీరాగం సం: 05-087

పల్లవి:

తేనెయు నేయు నంపోవు తీపుమాటల
కానీలే తేనెయు నేయుఁ గాదా నీయలుక

చ. 1:

కప్పురమే యంపోవు కటకటా అందుతోనే
అప్పుడైనా నిమ్మపండు నంపవైతివి
కప్పురగంధికి నీ కరుణ లేకుండుటే
కప్పురము నిమ్మపండుఁ గాదా నీయలుక

చ. 2:

సంపెంగనూనె యంపేవు సారెసారె నందుతోనె
అంపవైతి గన్నెరలు అప్పుడైనాను
ఇంపులేని కోమలికి నేఁటికి సంపెంగనూనె
కంపులును గన్నెరలుఁ గాదా నీయలుక

చ. 3:

నేరేడుఁ బండ్లే యంపేవు నెలఁతకు నందుతోనె
ఆరనియానవాలై నా నంపవైతివి
కోరి వేంకటేశ యింతిఁ గూడితిగాక లేకుంటే
నేరేడుఁబండ్లుఁ బాలును నేఁడేపో నీయలుక