పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0014-4 శ్రీరాగం సం: 05-083

పల్లవి:

చిమ్మకువే గోళ్ళంత జీరలయ్యీని
చిమ్ముఁ జెమటల నిన్నుఁ జిక్కించె నతఁడు

చ. 1:

కులికి నవ్వకువే కొప్పు వీడీని బెట్టు-
పలుకకువే మోవి బయలయ్యీని
వులికి పడకువే వొళ్ళు నొచ్చీని ని-
న్నెలయించి వలపుల నింత సేసె నతఁడు

చ. 2:

కన్నుల మొక్కకువే కాఁక రేఁగీని నీ-
వన్నెలు చూపకువే వడ చల్లీని
సన్నలఁ దిట్టకువే చలమెక్కీని నిన్ను
మన్ననలనే సిగ్గు మరపించె నతఁడు

చ. 3:

గుట్టున నడవవే కొంగు జారీని యింత-
తట్టుపుణుఁగేఁటికే తల నొచ్చీని
గట్టిగ శ్రీ తిరువేంకటరాయఁడు నిన్నుఁ
బెట్టని చోట్లఁ బెట్టిఁ పెద్దసేసె నతఁడు