పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0014-4 నాదరామక్రియ సం: 05-082

పల్లవి:

ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తూరి నిండెను
భామిని విభుఁనకు వ్రాసిన పత్రిక కాదుగదా

చ. 1:

కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోఁచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై నాటిన యాకొన చూపులు
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా

చ. 2:

పడఁతికి చనుఁగవ మెఱుఁగులు పైపై బయ్యెద వెలుపల
కడు మించిన విధమేమో కనుఁగొనరే చెలులు
ఉడుగని వేడుకతోఁ బ్రియుఁడొత్తిన నఖ శశి రేఖలు
వెడలఁగ వేసవికాలపు వెన్నెల గాదు గదా

చ. 3:

ముద్ధియ చెక్కుల కెలఁకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపుఁ జెమటల అందము గాదు గదా