పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0014-3 పాడి సం: 05-081

పల్లవి:

అంత సేయకుండితే నే నాఁటదాననా
పంతపు నీ బిగువెల్ల బయట వేయింతునా

చ. 1:

కూరిమి సతుల భీతి గోర నన్ను నంటనీక
సారెకుఁ దప్పించు కొంటా సాము సేసేవు
యేరా నీకు నింత వెరపిటువంటి నిన్నునే పో
జీరలు మేనెల్లఁ జేసి సిగ్గు విడిపింతునా

చ. 2:

మొక్కుచుఁ గెమ్మోవి మీఁద మోవనియ్యవేర పల్లు
వెక్కసపు తమకాన విఱ్ఱ వీఁగేవు
చిక్కితి వెక్కడికి విచ్చే సేవు నిన్ను నే
దక్కగొని మదన విద్యలనే చొక్కింతునా

చ. 3:

ఎక్కువ నామేని జవ్వాదిందరుఁ దెలిసేరంటా
మిక్కిలి నీ మేనితావి మెరయించేవు
చక్కని వేంకటగిరి స్వామి నన్ను గూడితివి
గక్కన నాచూపు నీకుఁ గావలి వెట్టింతునా